పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ మొదటివారంలో జరగనున్నాయి. విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక దృష్టి పెట్టారు.
పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు లేఖలు | విద్యాశాఖ ఆధ్వర్యంలో పంపిణీకి కసరత్తు
న్యూస్టుడే, కామారెడ్డి విద్యావిభాగం: పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ మొదటివారంలో జరగనున్నాయి. విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక దృష్టి పెట్టారు. పిల్లల బాధ్యతను గుర్తుచేసే విధంగా తల్లిదండ్రులకు లేఖలు అందిస్తున్నారు. ఈ నెల మూడోవారం నుంచి ప్రక్రియ కొనసాగుతోంది.
విద్యార్థుల అభ్యసనం తీరుపై చర్చించడానికి పక్షం రోజులకోసారి తల్లిదండ్రులతో సంబంధిత పాఠశాలల్లో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 25, మార్చి 18, 31 తేదీల్లో జరగనున్నాయి. తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరుకావాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. మండలస్థాయిలో నిర్వహించే వాటిల్లోనూ పాల్గొనేలా సమాచారం ఇవ్వాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. వీటిల్లో పరీక్షలకు సన్నద్ధమయ్యే విషయాలను అధికారులు తెలియజేయనున్నారు. విద్యార్థుల్లో నెలకొనే భయాందోళనలను తొలగించి ధైర్యం చెప్పనున్నారు.
శతశాతం ఫలితాలు సాధించేలా
ఈసారి అత్యధిక సంఖ్యలో 10 జీపీఏ సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని లేఖలు పొందుపరిచారు. వారిని వేకువజామునే నిద్రలేపడం, కఠిన అంశాలను చదివించడం వంటి చర్యలు చేపట్టాలని వాటి ద్వారా సూచనలు చేస్తున్నారు. పరీక్షలయ్యేంత వరకు తల్లి దండ్రులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.
ప్రత్యేక తరగతులకు హాజరయ్యేలా
పదో తరగతి పరీక్షలకు సన్నద్ధపరిచే క్రమంలో నిత్యం నిర్వహించే ప్రత్యేక తరగతులకు పిల్లలను పంపేలా తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని లేఖలో కోరుతున్నారు. విద్యార్థులు ఉదయం, సాయంత్రం గంట చొప్పున రావాలని చెబుతున్నారు. ఉపాధ్యాయులు, విద్యాశాఖ సహాయక కేంద్రానికి ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో వారానికి ఒక సబ్జెక్టుపై టీశాట్ ద్వారా నిర్వహించే తరగతులు వింటూ పిల్లలు లబ్ధిపొందేలా దృష్టి పెట్టాలని లేఖలో వివరిస్తున్నారు.